Sunday 15 February 2009

భేతాలుని కథలు - 2(స్త్రీ సుఖి, భోజనసుఖి, నిద్రాసుఖి అను వారి కథ )


వంగాదేశమున భూషణుడను ఉండెను. అతనికి ముగ్గురు కొడుకులు కలిగిఉండెను. ఆ బ్రాహ్మణుడు ఒక యాగము చేయదలచి తన పుత్రులను పిలిచి మీరు సముద్రమునకు వెళ్లి యొక కూర్మమును తీసుకొనిరండని చెప్పి పంపెను.

ఆ ముగ్గురు సముద్రమునకు వెళ్లి ఒక కూర్మమును చూచి తమ్ముని పిలిచి దానిని ఎత్తుకొని రమ్మని చెప్పగా వాడు నేను భోజన సుఖిని కనుక ఎత్తజాలనని తెలిపిను. రెండవవానిని యొత్తమనగా వాడు నేను స్త్రీ భోగిని కావున ఎత్తడములేదని చెప్పెను. జ్యేష్ఠుడు నేను నిద్రాసుఖిని కనుక ఎత్తనని పలికెను.

ఈ విధముగా వారు తగవుపడి, విజయనగరమనే పట్టణమునకుపోయి, ఆ పట్టణము నేలుచున్న ప్రతాపుడను రాజువద్ద తమ వాజ్యామును చెప్పుకొనిరి.

అప్పుడు ఆ రాజు వారి సామర్ధ్యమును తెలుసుకొనవలెనని భావించి ఒక స్త్రీని పిలిపించి, వేలగాక వస్త్రభూషణములు ధరింపజేసి స్త్రీ భోగి వద్దకు పంపగానే వాడు ఆ స్త్రీని చూచి, ముక్కు మూసుకొని నీవద్ద దుర్వాసన కలదు వెంటనే వెళ్ళిపొమ్మని పంపివేసెను. ఆ సంగతి రాజు తెలుసుకొని, దాని తల్లిని పిలిపించి ఆ స్త్రీ పూర్వచరిత్ర తెలుపుమనియడుగాగా "ఇది నా చెల్లెలి కూతురు. ఇది పుట్టిన ఐయిదు దినములకే నా చెల్లెలు మరణించినది. అప్పుడు నుంచి దేనికి మేకపాలు పట్టించి పెంచితిని. కావున దీని శరీరము దుర్వాసన కలిగిఉన్నది" అని చెప్పెను.

తరువాత రాజు మదురమైన పదార్ధము వండించి భోజనసుఖిని పిలిపించి భోజనం చేయమనగా, వాడు ఆ యన్నమును చూచి పీనుగుకంపు కొట్టుచున్నదని పలికి వదిలిపెట్టెను. రాజు ఆ సంగతి విచారించగా, ఆ యన్నము శ్మశానము దగ్గరనున్న భూమిలో పండించిన వడ్లబియ్యముతో వండిచినందున అట్టి వాసన కలిగినదని గ్రహించెను.

పిమ్మట ఆరాజు ఒక మృదువైన పరుపును తయారుచేయించి, నిద్ర సుఖ్ని పిలిచి దానిపై పరుండుమని చెప్పగా, వాడా పరుపుపై పవళించి వెంటనే పైకి లేచిపోయెను. అలా ఎందుకు చేసితివి అని రాజు అడుగగా ఆ పరుపులో ఒక వెంట్రుక ఉన్నది అది ఒత్తుకొనుటచే లేచితిని అని చెప్పెను. రాజు ఆ పరుపును విప్పించి చూడగా దానియందు రోమముండెను.

రాజు వారు ముగ్గురు చెప్పిన విషయములు విని, వారికిగల సామర్ధ్యమునకు సంతోషించి తగు బహుమతులు ఇచ్చి గౌరవించెను. ఓ విక్రమాదిత్య మహారాజా! ఆ ముగ్గురిలో ఎవరు అధిక సుకుమారులు?" అని ప్రశ్నించగా, విక్రమాదిత్యుడు "భోజన సుఖి, స్త్రీ సుఖి బుద్దిచేత గ్రహించి చెప్పిరి. నిద్రాసుఖి పరుపులోనున్న వెంట్రుక వలన కలిగిన దద్దు వాని శరీరమున కానవచ్చెను. కావున వాడే సుకుమారి" యని చెప్పెను. అది విని భేతాలుడు సంతోషించి, మరల పారిపోయి వృక్షంనెక్కి ఎప్పటి వలె యుండెను.


వ్యవహారం తెలిసి మాట్లాడితే తగాదా లేదు -- ఆహరం తెలిసి తింటే ఏ రోగం రాదు

సుందోపసుందులు


పూర్వం సుందోపసుందులు అనే అన్నదమ్ములు బ్రహ్మచేతిలో "ఎవరి చేతిలో చావకుండా" వరం పొంది తమ బలపరాక్రమాలతో చాలా రాజ్యాలు జయించి దేవతలని, ప్రజలని పీడిస్తూ పరిపాలన సాగిస్తూ ఉండేవాళ్ళు. వీల బాధలు పడలేక, దేవతలు ప్రజలు శివుడికి పోరపెట్టుకుంటే, శివుడు వెళ్లి విష్ణు మూర్తిని అడగమన్నాడు.

సరే వీళ్ళంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి విని అభయం ఇచ్చాడు, వీళ్ళ సంగతి నేను చేస్తాను అన్ని చెప్పి పంపాడు.

ఒకసారి సుందోపసుందులు వేటకోసం అడవికి వెళ్లి, అలసిపోయి ఒకచోట విశ్రమించారు. అప్పుడు వారికీ ఒక త్రిలోక సుందరి కనిపించింది. అప్పుడు వాళ్ళు ఇద్దరూ, ఆమె అందానికి ముగ్ధులై ఎవరికీ వారు ఆమెను చేపట్టాలి అని ఉవ్విళ్ళూరసాగారు. ఇంతకీ ఆ అతిలోకసుందరి ఎవరనగా మోహినీ రూపం దాల్చిన విష్ణుమూర్తి.

వీళ్ళు వెంటపడగా, మోహిని వారినుద్దేశించి "సుందరులారా! మీలో ఎవరో ఒకరినే నేను నా భర్తగా అంగీకరించగలను, మరి మీలో మీరు ఎవరు బలవంతులో తేల్చుకుని, అలా గెలిచిన వారే నన్ను చేపట్టాలి" అని అనగానే, సుందోపసుందులు పోట్లాడుకోవటం మొదలుపెట్టారు.

సుందుడు "నేను పెద్దవాడిని, కాబట్టి ఈమె నాకు రాణి కావలెను" అని, ఉపసుందుడు ఏమో, "ముందుగా ఆమెను నేను చూసాను, కాబట్టి ఆమె నా సొత్తు" అని వాదనకి దిగి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చారు.

అప్పటినుంచి, లోకంలో దుర్మార్గులయిన అన్నదమ్ములు గాని, మిత్రులు గాని తమలో తామే పోట్లాడుకోవటం జరిగితే వారిని సుందోపసుందులు అంతం పరిపాటి అయ్యింది.


మూర్ఖుని హృదయం నోటిలో ఉంటుంది - వివేకుడి నోరు అతని హృదయంలో ఉంటుంది

Saturday 14 February 2009

భేతాలుని కథలు - 1(బ్రాహ్మణ కన్య కథ )


విక్రమాదిత్యుడు ఆ మర్రిచెట్టుపైన ఉన్న భేతాళుని బంధించి తన వీపుపై కట్టుకొని, ముని వద్దకు వచ్చుండగా భేతాలుడు రాజునుద్దేశించి "ఓ విక్రమాదిత్య మహారాజా! నేనొక ఆశ్చర్యకరమైన కథ చెప్పుచున్నాను వినుము.

విశ్వావసుడను నొక బ్రాహ్మణుడు కలడు. అతడు వేదశాస్త్రములు బాగుగా చదివినవాడు. అతనికి లేకలేక ఒక కన్య కలిగెను. ఆ కన్య మిక్కిలి సౌందర్యముగా ఉండెను. తల్లితండ్రులు తగిన వరుని చూచి ఆమెకు వివాహం చేయవలెనని నిశ్చయించుకొనిరి. ఇట్లుండగా వారి యింటికి ముగ్గురు అందమైన బ్రాహ్మణ యువకులు వచ్చి, ఆ కన్యయొక్క అందచందములు చూచి ముగ్ధులై ఆమెను వివాహమాడగోరిరి. తాము నేర్పిన విద్యలను గూర్చి విశ్వావసునకు చెప్పుకొనిరి. విశ్వావసుడా ముగ్గురు యువకులను పరీక్షించి, ఆ ముగ్గురునూ సమర్దులేయని ద్రుడపరచుకొని వారిని చూచి "మీరు ముగ్గురూ మాకు నచ్చినారు. కావున మీలో ఎవనికి మా కన్యనిచ్చి వివాహముచేయవలేనో మేము నిశ్చయించుకొనలేకున్నాము. మీరు ముగ్గురూ ఆలోచించుకొని, మీలో నొకరు మా కన్యను వివాహమాడుటకు సమ్మతించిన యెడల వివాహము చేయుదును" అని చెప్పినాడు.

ఆయన మాటలు విని, వారా కన్యపై గల మోహముచే ఒకరు చేసికొనుటకు మరొకరు అంగీకరించక తగవుపడి, దుర్భాషలాడుకొని విశ్వావసుని వద్దకు వెళ్లి "అయ్యా! మేము దూరదేశమునకు పోవుచున్నాము. అచ్చట మా తగువు తీర్చుకొని ఒక అంగీకరంనకు వత్తుము. మేము తిరిగి వచ్చునంతవరకు ఈ కన్య నెవరికీ వివాహము చేయవద్దు" అని కోరిరి. విశ్వావసుడు అందుకు అంగీకరించగా, వారు దూరదేశమునకు పోయిరి.

ఆ విధంగా వెళ్ళిన యువకులు చాలాకాలం వరకు తిరిగి రాలేదు. ఈలోపుగా ఆ కన్య మరణించినది. తల్లిదండ్రులా కన్య శవమును శ్మశానంనకు తీసుకొనిపోయి దహన సంస్కారాలు గావించి యింటికి వచ్చిరి.

దురదేశాముననున్నఆ బ్రాహ్మణ యువకులకెట్లో ఆమె మరణవార్త తెలిసినది. అంతటవారు ముగ్గురూ ఆగ్రామమునకు వచ్చి ఆమెను దహనము చేసిన స్థలమునకు పోయి మిక్కిలి దుఃఖించిరి. తరువాత వారిలో నొకడు ఆ కన్య యొక్క బూడిదను తేసి శరీరమంతకు పూసుకొని ఆ స్మశానములోనే కాచుకొనియుండెను. మరియొకడు ఆ కన్యయొక్క శల్యముల నెత్తుకొని కాశీకి వెళ్ళెను. మూడవవాడు ఆమెయందు గల అధికమోహం వలనా నేమియు తోచక పిచ్చివానివలె పరదేశములకు పోయి తిరుగుచుండెను. అతడట్లు తిరుగుచు ఒకనాడు ఒక బ్రాహ్మణుని యింటికి పోయి అన్నం పెట్టమని కోరెను.

ఆ బ్రాహ్మణుడు జాలిపడి భార్యను పిలిచి ఆ బ్రాహ్మణ యువకునకు అన్నం పెట్టమని చెప్పి తాను స్నానం చెయుతకుపొయెను. అప్పుడా బ్రాహ్మణ స్త్రీ అన్నం వండుటకు కట్టెలు లేక, తన కొడుకును చంపి పొయ్యిలో పెట్టి మంట పెట్టి అన్నం వండెను. తరువాత ఆ పోయ్యిలోని బూడిదనంతను ఒకచోట చేర్చి, దానిపై నుదకమును చల్లి ఒక పుస్తకముతో కొట్టెను. అప్పుడా బూడిదనుండి ఆమె కుమారుడు వెలికివచ్చెను. అది యా బ్రాహ్మణ యువకుడు చూచి ఆశర్యపడి, ఈ ఉపాయముతో విశ్వావసుని కుమార్తెను బ్రతికిన్చవచ్చుఅని తలచి, భోజనం చేసి అచ్చట కొంతసేపు నిద్ర పోయినట్లు నటించి, ఆ పుస్తకంను దొంగిలించి ఆ బ్రాహ్మణ కన్యను దహనం చేసిన స్థలమునకు వెళ్ళెను.

అదే సమయమునకు గంగాస్నానమునకు కాశికేగిన బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడికి వచ్చెను. మూడోవాడు ఆ కన్యయొక్క బూడిదను శరిరంనకు పూసుకొని అచ్చటనే కనిపెట్టుకోనియుండెను. పుస్తకంను తెచ్చిన యువకుదు బూడిదనంతను ఒకచోట చేర్చి దానిపై నుదకంచల్లి ఆపుస్తకంతో కొట్టెను. వెంటనే ఆ కన్య బ్రతికెను. అంతన ఆముగ్గురు యువకులు పరమానందము పొడి, నేను వివాహమాడుదునంటే నేను వివాహమాడుదునని తగువు పడసాగిరి.

కావున ఆముగ్గురిలో ఆకన్య యెవరికి భార్యయగుట న్యాయము?" అని భేతాలుడు అడుగగా, విక్రమాదిత్యుడు "ఆ కన్యయొక్క శల్యములను తీసుకోని గంగకు పోయనవాడు పుత్రుడనదగును బ్రతికించినవాడు తండ్రివంటి వాడు. శ్మశానమునందుండి ఆమెను దహనముచేసిన స్థలమున బూడిదను కాచుకోనియున్నవాడు ఆమెకు భర్త కాదగును" అని చెప్పగా, భేతాలుడు సంతోషించి, వీపుపై నుండి మాయమై చెట్టు పైకిపోయి ఎప్పటివలెనుండెను.


తప్పించుకొవడం సులభం - మెప్పించడం కష్ఠం

శాంతశీలుడను యోగి విక్రమాదిత్యుని వద్దకు వచ్చుట

దేవేంద్రుని వరంతో, భట్టి సహాయంతో విక్రమాదిత్యుడు ఉజ్జియినిని ఎంతొ వైభవంగా పాలించుచుండెను. ఒక నాడు శాంతశీలుడను ఋషి రాజును దర్శించుటకు వచ్చెను. అతడు రాజును దర్శించి తనవెంట తెచ్చిన ఒక దానిమ్మపండును యిచ్చెను. రాజు దానిని తినకుండ, జాగ్రత్త పెట్టుడని భటులకు ఆజ్ఞాపించెను. శాంతశీలుడు ప్రతిదినం రాజును దర్శించుటకు వచ్చినప్పుడల్లా ఒక దానిమ్మపండునిచ్చి పోవుచుండెను. రాజు వాటిని తినక, భటులకిచ్చి భద్రముగా దాచు ఉండిరి.

అలా జరుగుచుండగా, ఒకనాడు శాంతశీలుడు యిచ్చిన పండుని ప్రక్కన కూర్చున్న తన కుమారుడికిచ్చెను. తలవని తలంపుగా అక్కడికి ఒక కోతివచ్చి బాలుని చేతిలోని పండుని అపహరించి, కొరికి తినబోగా ఆ పండు నుండి జలజల రత్నములు రాలేను. వాటిని చూచి రాజు ఆశ్చర్యపడి ఇంతకుముందు భద్రపరిచిన పండ్లను తెమ్మనెను. రాజు ఆ పండ్లను పగలగొట్టించి చూడగా అన్నిటిలో వెలగల రత్నములు ఉండెను. వాటిని చూచి రాజు ఆశ్చర్యానందములు పొందెను.

మరునాడు శాంతశీలుడు యధాప్రకారం రాజును దర్శించుటకు వచ్చి, ఒక దానిమ్మ పండును ఇచ్చెను. ఆపుడు విక్రమాదిత్యుడు ఆ ఋషిని చూచి, "స్వామీ! మీరు ప్రతిదినం నావద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించి వెల్లుచున్నారు. మీరిట్లు చేయుటకు ఏమైనా కారణం ఉండును. ఆ కారణమేదో తెలుపుడు. నా వలన మీకు కావాలసినపని ఏదయినా ఉన్నచో చెప్పుడు. నేను తప్పక చేసెద"నని పలికెను.

అది విని శాంతశీలుడు "మహారాజా! నేనపరపక్ష ద్వాదశినాడు అర్ధరాత్రి నాడు శ్మశానమునందు యాగం చేయదలచితిని. మీరు ఒంటరిగా వచ్చి నాయాగం పూర్తియగునట్లు సహాయపడవలె"నని కోరెను. అది విని రాజు అందుకు అంగీకరించెను.

విక్రమాదిత్యుడు ఋషికి చెప్పిన ప్రకారము అపరపక్ష ద్వాదశినాడు అర్ధరాత్రి సమయమున ఒంటరిగానొక ఖడ్గమును పట్టుకొని శ్మశానమునకు పోయి శాంతశీలుని ముందు నిలబడెను.
అప్పుడా శాంతశీలుడను ఋషి ప్రేతముఖమునందు హోమము చేయుచు రాజును చూచి ఎంతో ఆనందిచి, "ఓ సత్యసంధుడా! మంచి సమయమునకు వచ్చితివి. ఇక్కడికి దక్షిణ పార్శ్వంబున నోకపెద్ద మర్రిచెట్టు కలదు. ఆ చెట్టుపై నొక బేతాళమున్నది. దానిని నీవు పట్టితేవలెను. నీవు దానిని పట్టితెచ్చునప్పుడు దానితో నీవు మాట్లాడకూడదు" అని చెప్పెను.

రాజు "అట్లే చేసెద"నని, కొరవి చేతబట్టుకొని ఒంటరిగా ఆ చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపైనున్న భేతాళుని చూచెను. అప్పుడా భేతాలుడు తలక్రిందుగా కాళ్లు మీదుగా వ్రేలాడుచుండెను. రాజు దానిని చూచి ఏ మాత్రము భయపడగా, చెట్టుమిదికి పోయి, భేతలుని ఈడ్చి క్రిందకుత్రోసి తానూ చెట్టుదిగుసరికి ఆ భేతాళుడు నవ్వుచు నిముషములో పైకెగసి ముందువలె వృక్షమును పట్టుకొని వ్రేలాడుచుండెను.

అంతట రాజు మరల చెట్టుపైకిపోయి భేతాలునిపట్టి తన ఉత్తరీయముతొ కట్టి వీపుపైనుంచుకొని క్రిందికి దిగివచ్చెను. అప్పుడు భేతాళుడు తన శాపవిమోచన సమయము దగ్గరైనదని తలచి "ఓ మహారాజా! శీఘ్రముగా త్రోవజరుగుటకై నేనొక కథ చెప్పెదను విను"మని క్రింది విధముగా కథ చెప్పుచుండగా విక్రమాదిత్యుడు మౌనముగా నుండి వినుచు పోవుచుండెను.



జ్ఞానము ఉన్న చోట శక్తి ఉంటునది - తెలివి ఉన్న చోట వెలుగు ఉంటుంది

Friday 13 February 2009

మహాకాళి భట్టికి వరములిచ్చుట


విక్రమాదిత్యుడికి దేవేంద్రుడిచ్చిన వరం విని భట్టి కూడా వేయి సంవత్సరములు బ్రతికిఉండుటకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని నిశ్చయించుకున్నాడు. తన ఇష్ట దేవతయగు కాళి అనుగ్రహం పొంది తన కోరిక తీర్చుకోవాలని, ఆ రాత్రి సమయమున కాళి గుడికి వెళ్లి దేవత దర్శనం కోసం పూజించాడు. తన భక్తికి మెచ్చి దేవి ప్రత్యక్షం అయ్యి, ఏమి కావలనో కోరుకొమనేను. ఆ మాటలకు చాలా సంతసించి విక్రమదిత్యుడికి దేవేంద్రుండి ద్వారా వచ్చిన వరం గూర్చి చెప్పెను. "లోకమాతా ! నాకు రెండువేల సంవత్సరాలు జీవించునట్లు వరం అనుగ్రహింపుము" అని ప్రార్ధించెను.

అతని ప్రార్ధన విని "నీవు విక్రమాదిత్యుడి తల నరికి తెచ్చి బలిపీఠమున నుంచిన నీవు కోరిన వరమిచ్చెద" నని దేవి చెప్పెను. దేవి మాటలు విని భట్టి కొంతసేపు ఆలోచించి పరుగు పరుగున పోయి గాఢనిద్రలో మునిగియున్న విక్రమాదిత్యుని లేపి, జరిగిన విషయం చెప్పగా, "తమ్ముడూ! నీవు వెంటనే దేవి కోరినట్లు చేయుము" అని పలికి శిరస్సును వంచెను. భట్టి దేవిపై భారం వేసి ఖడ్గంతో విక్రమాదిత్యుని శిరస్సును ఖండించి మహాకాళి గుడికి తెచ్చి బలిపీఠమున ఉంచెను.

దానిని చూచి దేవి ఆనందించి "నీవు కోరిన వరం యిచ్చితిని సుఖంగా రెండువేల సంవత్సరములు జీవించు ఖ్యాతిపొందుము" అని చెప్పగా, భట్టి నవ్వి "తల్లీ! దేవేంద్రుడు అంతనివాని నుండి వేయి సంవత్సరములు రాజ్యపాలన చేయమని వరం పొందిన నా అన్నగతి యిట్లయినది. ఇక నా సంగతి ఏమగునో?" అని అడుగగా, దేవి సంతోషించి "వత్సా! నీ తెలివితేటలకు, చాతుర్యమునకు, నాయందు గల భక్తికి నీకు వరమిచ్చితిని. ఆ వరం ఎన్నటికి వృధా కాదు. నీకు మరియొక వరమేదైనా అడుగుము,యిచ్చెద" ననగా, భట్టి ఆనందభరితుడై "తల్లీ! విక్రమాదిత్యుడు లేకుండా నేను జీవించలేను. కావున అతనిని బ్రతికింపుము" అని కోరెను. అది విని దేవి ఎంతో సంతోషించి వెంటనే విక్రమాదిత్యుని బ్రతికించి "సుఖంగా జీవించు"మనని దీవించి పంపెను.

ఇంటికి వెళ్ళిన తరువాత మనమిద్దరం రెండువేల సంవత్సరములు జీవించవచ్చు అనేను. అది విని, విక్రమాదిత్యుడు ఎలా అని ప్రశ్నించెను. దానికి భట్టి, దేవేంద్రుడు నీకు యిచ్చిన వరం వేయి సంవత్సరములు రాజ్యపాలన చేయమని కదా! నేను కాళిమాత వలన రెండువేల సంవత్సరములు జీవించునట్లు వరం పొందితిని. నీవు సంవత్సరమునకు ఆరు మాసములు రాజ్యపాలన చేయుము. మిగిలిన ఆరు మాసములు వినోద యాత్రలతో, తీర్ధయాత్రలతో గడుపుము. నీవు ఆవిధముగా వెళ్ళినప్పుడు రాజ్యపాలన నేను చేయుచుందును. ఇలా చేసినచో నాతొ పాటు నీవు కూడా రెండువేల సంవత్సరములు జీవించగలవు. దేవేంద్రుడిచ్చిన వరం ప్రకారం వేయి సంవత్సరములు మాత్రమే రాజ్యపాలన చేసినట్లగును అని చెప్పెను.

ఆ మాటలు విన్న రాజు చాలా సంతోషం పొంది, తమ్ముని కౌగలించుకొని "సోదరా! నీ బుద్ది బలచాతుర్యములు అమోఘం అని కొనియాడెను. నీవు చెప్పిన విధంగా మనమిద్దరం రెండువేల సంవత్సరములు కలిసిమెలిసి ఉందుము" అని పలికెను.

డబ్బును కోల్పోవడం మాములు నష్టం - మిత్రుని కోల్పోవడం పెద్ద నష్టం

భేతాలుని కథ

ప్రాచీనకాలమున పరమేశ్వరుడు పార్వతిదేవితో ఏకాంతంగా ఉన్నపుడు ఒకనాడు, రాత్రిసమయమున పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి "నాథా! ఈలొకములొ ఎవరికీ తెలియని చిత్రవిచిత్రమైన కథలేవయిన చెప్పుడు" అని అడిగెను. ఆ కోరికవిని పరమేశ్వరుడు ఆనందించెను. "దేవీ! నీవు కోరిన ప్రకారం ఇంతవరకు ఎవరికీ తెలియని చిత్రవిచిత్రమైన కథలను చెప్పెదను." అని సూర్యోదయం వరకు కొన్ని కథలు చెప్పి ముగించెను. ఆ రాత్రి సమయంన పరమేశ్వరుని పూజించుటకొక బ్రాహ్మణుడు వచ్చియుండెను. అతడు పూజానంతరం ఇంటికిపోక గుడి సమీపమున ఒకచోట రహస్యంగా నక్కిఉండెను. అట్లు నక్కిఉన్న బ్రాహ్మణుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథలన్నిటిని చక్కగా విని, ఇంటికిపోయి భార్యకు చెప్పెను. అతని భార్య ఆకథలను ఉరుగుపొరుగు స్త్రీలకు చెప్పెను. ఈవిధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథలు లోకమంతట తెలిసిపోయినవి. ఆ సంగతి పార్వతీదేవికి తెలిసినది. చిరుకోపం చెంది, పరమేశ్వరుని చూచి," స్వామీ! మీరు నాకు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని కథలు చెప్పెదమని మాటయిచ్చి అందరికి తెలిసిన కథలే చెప్పినారు." అని అడుగగా,పరమేశ్వరుడు ఆగ్రహం పొంది, తన దివ్యదృష్టిచే ఆ కథలు ఒక బ్రాహ్మణుడు రహస్యంగా విని బయటపెట్టినాడని తెలుసుకొని, ఆ బ్రాహ్మణుని రప్పించి," నేను పార్వతికి రహస్యంగా చెప్పినకథలు నీవు మా ఆజ్ఞ లేక విని బట్టబయలు చేసితివిగాన నీవు తక్షణము పిశాచమగుడువుగాక!" అని శపించెను. పరమేశ్వరుని శాపం విని ఆ బ్రాహ్మణుడు గజగజ వణుకుతూ "దేవదేవా! నా అపరాధము క్షమించి, శాపవిముక్తి కలుగుమార్గం తెలుపుడు" అని ప్రార్దించగా నందికేశ్వరుడు ఇట్లుచెప్పెను-" కొంతకాలం గడిచిన తరువాత భూలోకమున విక్రమాదిత్యుడను రాజు జన్మించి చిరకాలం రాజ్యపాలన చేయును, ఆ రాజోక రుషికోరిక తీర్చుటకై నీవద్దకు వచ్చును. అప్పుడతనికి ఈ కథలన్నియు చెప్పిన పిమ్మట శాపవిముక్తుడవగుదువు" ఆ మాటలు విని బ్రాహ్మణుడు కొంత తృప్తి పడెను. ఆ విదంగా ఆ బ్రాహ్మణుడు పిశాచంగా మారి, ఒక అడవిలో ఒక చెట్టుపై నివసించుచుండెను.




నవ్వును మించిన అలంకరణ లేదు - సంతృప్తిని మించిన సంపద లేదు

నాట్యం చేయుటలోఎవరు గొప్ప? రంభా, ఊర్వశియా

ఒకనాడు దేవలోకమున ఇంద్రుని సభలో రంభ, ఊర్వశి నాట్యంలో ఒకరికంటే ఒకరు గొప్పవారమని కీచులాడుకొనేను. తుదకు దేవేంద్రుని వద్దకుపోయి మా యిరివురిలో నాట్యం చేయుటలో ఎవరు గోప్పవారో చెప్పమని అడిగెను. దేవేంద్రుడు ఏమి చెప్పవలేనో తోచక మునిశ్వరులతోను, దేవతలతోను సభ ఏర్పాటు చేసి వారిద్దరిలో ఎవరు నాట్యం బాగా చేయగలరో నిర్ణయించమని అడిగెను. దానికి రంభ, ఉర్వశిలిద్దరూ ఒకరిని మించినట్లు మరియొకరు నాట్యం చేసిరి. ఆ నాట్యం చూసిన దేవతలు, ఋషులు వారిద్దరిలో ఎవరు అధికులో, ఎవరు అధములో నిశ్చయించలేక "ఇద్దరును బాగానే నాట్యం చేసిరి. మీలో ఒకరు గొప్పవారు, మరిఒకరు తక్కువ వారని చెప్పుట వీలుకాదు. కావున భేధబుద్ది లేక అన్యోన్యంగా ఉండుము" అని చెప్పిరి. ఎవరు ఎంత చెప్పిన ఆ అప్సరసలు పట్టిన పట్టు విడువలేదు.మా యిద్దరిలో ఎవరుగొప్పవారో తేలనంతవరకు మేము నాట్యం చేయమని చెప్పిరి.

అదే సమయంన సభకు నారద మహర్షి వచ్చెను. విషయం తెలుసుకొని, "దేవేంద్రా!, భూలోకమున ఉజ్జయిని నగరంను మహాపరాక్రమంతుడు, దానశీలుడు, మేధావి, సకల విద్యలలో సంపూర్ణ పాండిత్యం గలవాడునగు విక్రమాదిత్యుడు పాలించుచున్నాడు. అతనిని పిలిపించినచో, ఎవరు గొప్పవాడో తేల్చి చెప్పగలడు" అని చెప్పెను. దేవేంద్రుడు నారదుని సలహా ప్రకారం ఉజ్జయినికి రథమును పంపి క్షణములో విక్రమాదిత్యుని సభకు రప్పించెను. సభలో ఉన్నవారిని పరిచయం చేసి తనను రప్పించిన కారణంను చెప్పెను. దేవేంద్రుని మాటలు విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యనందములు పొంది తనకు కొంత వ్యవధి యిమ్మని కొరెను.

దేవేంద్రుదు అందుకు అంగీకరించగా విక్రమాదిత్యుడు సభ నుండి ఒక ఉద్యానవనమునకు పొయి,కొన్నిపూవులను కొసి రెండు పూలచెండ్లను చేసెను. వాటిలొ కొన్ని కీటకములను ఉంచెను. ఆ పూలబంతులను రంభకు, ఊర్వశికి ఇచ్చి నాట్యం చేయమనెను. వారు అందుకు అంగీకరించి పూలచెండ్లను పట్టి నాట్యం చేయనారంభించెను. రంభ తన చేతిలో ఉన్న పూలచెండును గట్టిగా అదిమి పట్టుకోనుటచే దానియందున్న కీటకములు చెదిరి ఆమెను కుట్టి బాధించసాగినవి. అందువలన ఆమె నాట్యం చేయుట కొంత తడబదసాగినది . ఊర్వశి తన చేతి యందున్న పూలచెండును మృదువుగా పట్టుకొని ఏవిధమైన బాధ పొందక హాయిగా నాట్యం చేసెను కొంతసేపు అలా వారి నాట్యప్రదర్శన జరిగిన తరువాత దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని చూచి "వీరిద్దరిలో ఎవరు బాగుగా నాట్యం చేసిరి?" అని అడుగగా, "ఊర్వశి బాగుగా నాట్యం చేసెను" అని చెప్పెను.

అది విని దేవేంద్రుడు " ఆ విషయమును మీరు ఎలా నిర్ణయించిరి?" అని అడుగగా, దానికి విక్రమాదిత్యుడు రంభను, ఊర్వశిని చూచి, "మీకు నేనిచ్చిన పూలచెండ్లను ఇటు ఇవ్వండి" అని అడిగెను. రంభ నాట్యం చేస్తున్నపుడు దానిని క్రిందపడవేసెను. అందువలన తలవంచి నిలబడెను. ఊర్వశి తన చేతిలోనున్న చెండును విక్రమాదిత్యుని ఎదుట పెట్టెను. అప్పుడు విక్రమాదిత్యుడు దేవేంద్రుని చూచి," దేవేంద్రా!, వీరిద్దరిలో గలభేదములు గమనించితిరి కదా! రంభ నేనిచ్చిన చెండును క్రిందపడవేసెను. ఊర్వశి నేను ఇచ్చిన చెండును భద్రంగా పట్టుకొని నాట్యం చేసెను." అని చెప్పి, ఊర్వశి ఇచ్చిన చెండును దేవేంద్రుని ముందు విప్పి అందున్న కిటకములను చూపించి "ఊర్వశి ఈ చెండును మృదువుగా పట్టుకొని ఉన్నందున ఇందులోని కీటకములు బాధకలిగి ఆమెను కుట్టి బాధించసాగినది. ఆ బాధ వలన రంభ నాట్యం సరిగా చేయలేక పోయినది, ఆ కిటకముల బాధతో ఆమె చెండును క్రిందపడవేసినది. కావున ఊర్వశినె గెలుపొందినదని నా నిశ్చయం" అని చెప్పెను.

దేవేంద్రుడు విక్రమాదిత్యుదుని బుద్దిచతురతకు ఆనందించి, నవరత్నఖచిత స్వర్నమయమగు సింహాసనంను ఒకటి బహుమతిగా ఇచ్చి , "నీవీ సింహాసనముపై కూర్చుండి వేయిసంవత్సరములు రాజ్యపాలన చేయగల" వని వరమిచ్చి ఆశీర్వదించి రథమున కూర్చుండబెట్టి ఉజ్జయినికి పంపెను.



దీపం క్రింద నీడ సహజం - మనిషి బ్రతుకులో తప్పులు సహజం