Saturday 14 February 2009

భేతాలుని కథలు - 1(బ్రాహ్మణ కన్య కథ )


విక్రమాదిత్యుడు ఆ మర్రిచెట్టుపైన ఉన్న భేతాళుని బంధించి తన వీపుపై కట్టుకొని, ముని వద్దకు వచ్చుండగా భేతాలుడు రాజునుద్దేశించి "ఓ విక్రమాదిత్య మహారాజా! నేనొక ఆశ్చర్యకరమైన కథ చెప్పుచున్నాను వినుము.

విశ్వావసుడను నొక బ్రాహ్మణుడు కలడు. అతడు వేదశాస్త్రములు బాగుగా చదివినవాడు. అతనికి లేకలేక ఒక కన్య కలిగెను. ఆ కన్య మిక్కిలి సౌందర్యముగా ఉండెను. తల్లితండ్రులు తగిన వరుని చూచి ఆమెకు వివాహం చేయవలెనని నిశ్చయించుకొనిరి. ఇట్లుండగా వారి యింటికి ముగ్గురు అందమైన బ్రాహ్మణ యువకులు వచ్చి, ఆ కన్యయొక్క అందచందములు చూచి ముగ్ధులై ఆమెను వివాహమాడగోరిరి. తాము నేర్పిన విద్యలను గూర్చి విశ్వావసునకు చెప్పుకొనిరి. విశ్వావసుడా ముగ్గురు యువకులను పరీక్షించి, ఆ ముగ్గురునూ సమర్దులేయని ద్రుడపరచుకొని వారిని చూచి "మీరు ముగ్గురూ మాకు నచ్చినారు. కావున మీలో ఎవనికి మా కన్యనిచ్చి వివాహముచేయవలేనో మేము నిశ్చయించుకొనలేకున్నాము. మీరు ముగ్గురూ ఆలోచించుకొని, మీలో నొకరు మా కన్యను వివాహమాడుటకు సమ్మతించిన యెడల వివాహము చేయుదును" అని చెప్పినాడు.

ఆయన మాటలు విని, వారా కన్యపై గల మోహముచే ఒకరు చేసికొనుటకు మరొకరు అంగీకరించక తగవుపడి, దుర్భాషలాడుకొని విశ్వావసుని వద్దకు వెళ్లి "అయ్యా! మేము దూరదేశమునకు పోవుచున్నాము. అచ్చట మా తగువు తీర్చుకొని ఒక అంగీకరంనకు వత్తుము. మేము తిరిగి వచ్చునంతవరకు ఈ కన్య నెవరికీ వివాహము చేయవద్దు" అని కోరిరి. విశ్వావసుడు అందుకు అంగీకరించగా, వారు దూరదేశమునకు పోయిరి.

ఆ విధంగా వెళ్ళిన యువకులు చాలాకాలం వరకు తిరిగి రాలేదు. ఈలోపుగా ఆ కన్య మరణించినది. తల్లిదండ్రులా కన్య శవమును శ్మశానంనకు తీసుకొనిపోయి దహన సంస్కారాలు గావించి యింటికి వచ్చిరి.

దురదేశాముననున్నఆ బ్రాహ్మణ యువకులకెట్లో ఆమె మరణవార్త తెలిసినది. అంతటవారు ముగ్గురూ ఆగ్రామమునకు వచ్చి ఆమెను దహనము చేసిన స్థలమునకు పోయి మిక్కిలి దుఃఖించిరి. తరువాత వారిలో నొకడు ఆ కన్య యొక్క బూడిదను తేసి శరీరమంతకు పూసుకొని ఆ స్మశానములోనే కాచుకొనియుండెను. మరియొకడు ఆ కన్యయొక్క శల్యముల నెత్తుకొని కాశీకి వెళ్ళెను. మూడవవాడు ఆమెయందు గల అధికమోహం వలనా నేమియు తోచక పిచ్చివానివలె పరదేశములకు పోయి తిరుగుచుండెను. అతడట్లు తిరుగుచు ఒకనాడు ఒక బ్రాహ్మణుని యింటికి పోయి అన్నం పెట్టమని కోరెను.

ఆ బ్రాహ్మణుడు జాలిపడి భార్యను పిలిచి ఆ బ్రాహ్మణ యువకునకు అన్నం పెట్టమని చెప్పి తాను స్నానం చెయుతకుపొయెను. అప్పుడా బ్రాహ్మణ స్త్రీ అన్నం వండుటకు కట్టెలు లేక, తన కొడుకును చంపి పొయ్యిలో పెట్టి మంట పెట్టి అన్నం వండెను. తరువాత ఆ పోయ్యిలోని బూడిదనంతను ఒకచోట చేర్చి, దానిపై నుదకమును చల్లి ఒక పుస్తకముతో కొట్టెను. అప్పుడా బూడిదనుండి ఆమె కుమారుడు వెలికివచ్చెను. అది యా బ్రాహ్మణ యువకుడు చూచి ఆశర్యపడి, ఈ ఉపాయముతో విశ్వావసుని కుమార్తెను బ్రతికిన్చవచ్చుఅని తలచి, భోజనం చేసి అచ్చట కొంతసేపు నిద్ర పోయినట్లు నటించి, ఆ పుస్తకంను దొంగిలించి ఆ బ్రాహ్మణ కన్యను దహనం చేసిన స్థలమునకు వెళ్ళెను.

అదే సమయమునకు గంగాస్నానమునకు కాశికేగిన బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడికి వచ్చెను. మూడోవాడు ఆ కన్యయొక్క బూడిదను శరిరంనకు పూసుకొని అచ్చటనే కనిపెట్టుకోనియుండెను. పుస్తకంను తెచ్చిన యువకుదు బూడిదనంతను ఒకచోట చేర్చి దానిపై నుదకంచల్లి ఆపుస్తకంతో కొట్టెను. వెంటనే ఆ కన్య బ్రతికెను. అంతన ఆముగ్గురు యువకులు పరమానందము పొడి, నేను వివాహమాడుదునంటే నేను వివాహమాడుదునని తగువు పడసాగిరి.

కావున ఆముగ్గురిలో ఆకన్య యెవరికి భార్యయగుట న్యాయము?" అని భేతాలుడు అడుగగా, విక్రమాదిత్యుడు "ఆ కన్యయొక్క శల్యములను తీసుకోని గంగకు పోయనవాడు పుత్రుడనదగును బ్రతికించినవాడు తండ్రివంటి వాడు. శ్మశానమునందుండి ఆమెను దహనముచేసిన స్థలమున బూడిదను కాచుకోనియున్నవాడు ఆమెకు భర్త కాదగును" అని చెప్పగా, భేతాలుడు సంతోషించి, వీపుపై నుండి మాయమై చెట్టు పైకిపోయి ఎప్పటివలెనుండెను.


తప్పించుకొవడం సులభం - మెప్పించడం కష్ఠం

No comments:

Post a Comment