Friday 13 February 2009

భేతాలుని కథ

ప్రాచీనకాలమున పరమేశ్వరుడు పార్వతిదేవితో ఏకాంతంగా ఉన్నపుడు ఒకనాడు, రాత్రిసమయమున పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి "నాథా! ఈలొకములొ ఎవరికీ తెలియని చిత్రవిచిత్రమైన కథలేవయిన చెప్పుడు" అని అడిగెను. ఆ కోరికవిని పరమేశ్వరుడు ఆనందించెను. "దేవీ! నీవు కోరిన ప్రకారం ఇంతవరకు ఎవరికీ తెలియని చిత్రవిచిత్రమైన కథలను చెప్పెదను." అని సూర్యోదయం వరకు కొన్ని కథలు చెప్పి ముగించెను. ఆ రాత్రి సమయంన పరమేశ్వరుని పూజించుటకొక బ్రాహ్మణుడు వచ్చియుండెను. అతడు పూజానంతరం ఇంటికిపోక గుడి సమీపమున ఒకచోట రహస్యంగా నక్కిఉండెను. అట్లు నక్కిఉన్న బ్రాహ్మణుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథలన్నిటిని చక్కగా విని, ఇంటికిపోయి భార్యకు చెప్పెను. అతని భార్య ఆకథలను ఉరుగుపొరుగు స్త్రీలకు చెప్పెను. ఈవిధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథలు లోకమంతట తెలిసిపోయినవి. ఆ సంగతి పార్వతీదేవికి తెలిసినది. చిరుకోపం చెంది, పరమేశ్వరుని చూచి," స్వామీ! మీరు నాకు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని కథలు చెప్పెదమని మాటయిచ్చి అందరికి తెలిసిన కథలే చెప్పినారు." అని అడుగగా,పరమేశ్వరుడు ఆగ్రహం పొంది, తన దివ్యదృష్టిచే ఆ కథలు ఒక బ్రాహ్మణుడు రహస్యంగా విని బయటపెట్టినాడని తెలుసుకొని, ఆ బ్రాహ్మణుని రప్పించి," నేను పార్వతికి రహస్యంగా చెప్పినకథలు నీవు మా ఆజ్ఞ లేక విని బట్టబయలు చేసితివిగాన నీవు తక్షణము పిశాచమగుడువుగాక!" అని శపించెను. పరమేశ్వరుని శాపం విని ఆ బ్రాహ్మణుడు గజగజ వణుకుతూ "దేవదేవా! నా అపరాధము క్షమించి, శాపవిముక్తి కలుగుమార్గం తెలుపుడు" అని ప్రార్దించగా నందికేశ్వరుడు ఇట్లుచెప్పెను-" కొంతకాలం గడిచిన తరువాత భూలోకమున విక్రమాదిత్యుడను రాజు జన్మించి చిరకాలం రాజ్యపాలన చేయును, ఆ రాజోక రుషికోరిక తీర్చుటకై నీవద్దకు వచ్చును. అప్పుడతనికి ఈ కథలన్నియు చెప్పిన పిమ్మట శాపవిముక్తుడవగుదువు" ఆ మాటలు విని బ్రాహ్మణుడు కొంత తృప్తి పడెను. ఆ విదంగా ఆ బ్రాహ్మణుడు పిశాచంగా మారి, ఒక అడవిలో ఒక చెట్టుపై నివసించుచుండెను.




నవ్వును మించిన అలంకరణ లేదు - సంతృప్తిని మించిన సంపద లేదు

No comments:

Post a Comment