Friday 13 February 2009

మహాకాళి భట్టికి వరములిచ్చుట


విక్రమాదిత్యుడికి దేవేంద్రుడిచ్చిన వరం విని భట్టి కూడా వేయి సంవత్సరములు బ్రతికిఉండుటకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని నిశ్చయించుకున్నాడు. తన ఇష్ట దేవతయగు కాళి అనుగ్రహం పొంది తన కోరిక తీర్చుకోవాలని, ఆ రాత్రి సమయమున కాళి గుడికి వెళ్లి దేవత దర్శనం కోసం పూజించాడు. తన భక్తికి మెచ్చి దేవి ప్రత్యక్షం అయ్యి, ఏమి కావలనో కోరుకొమనేను. ఆ మాటలకు చాలా సంతసించి విక్రమదిత్యుడికి దేవేంద్రుండి ద్వారా వచ్చిన వరం గూర్చి చెప్పెను. "లోకమాతా ! నాకు రెండువేల సంవత్సరాలు జీవించునట్లు వరం అనుగ్రహింపుము" అని ప్రార్ధించెను.

అతని ప్రార్ధన విని "నీవు విక్రమాదిత్యుడి తల నరికి తెచ్చి బలిపీఠమున నుంచిన నీవు కోరిన వరమిచ్చెద" నని దేవి చెప్పెను. దేవి మాటలు విని భట్టి కొంతసేపు ఆలోచించి పరుగు పరుగున పోయి గాఢనిద్రలో మునిగియున్న విక్రమాదిత్యుని లేపి, జరిగిన విషయం చెప్పగా, "తమ్ముడూ! నీవు వెంటనే దేవి కోరినట్లు చేయుము" అని పలికి శిరస్సును వంచెను. భట్టి దేవిపై భారం వేసి ఖడ్గంతో విక్రమాదిత్యుని శిరస్సును ఖండించి మహాకాళి గుడికి తెచ్చి బలిపీఠమున ఉంచెను.

దానిని చూచి దేవి ఆనందించి "నీవు కోరిన వరం యిచ్చితిని సుఖంగా రెండువేల సంవత్సరములు జీవించు ఖ్యాతిపొందుము" అని చెప్పగా, భట్టి నవ్వి "తల్లీ! దేవేంద్రుడు అంతనివాని నుండి వేయి సంవత్సరములు రాజ్యపాలన చేయమని వరం పొందిన నా అన్నగతి యిట్లయినది. ఇక నా సంగతి ఏమగునో?" అని అడుగగా, దేవి సంతోషించి "వత్సా! నీ తెలివితేటలకు, చాతుర్యమునకు, నాయందు గల భక్తికి నీకు వరమిచ్చితిని. ఆ వరం ఎన్నటికి వృధా కాదు. నీకు మరియొక వరమేదైనా అడుగుము,యిచ్చెద" ననగా, భట్టి ఆనందభరితుడై "తల్లీ! విక్రమాదిత్యుడు లేకుండా నేను జీవించలేను. కావున అతనిని బ్రతికింపుము" అని కోరెను. అది విని దేవి ఎంతో సంతోషించి వెంటనే విక్రమాదిత్యుని బ్రతికించి "సుఖంగా జీవించు"మనని దీవించి పంపెను.

ఇంటికి వెళ్ళిన తరువాత మనమిద్దరం రెండువేల సంవత్సరములు జీవించవచ్చు అనేను. అది విని, విక్రమాదిత్యుడు ఎలా అని ప్రశ్నించెను. దానికి భట్టి, దేవేంద్రుడు నీకు యిచ్చిన వరం వేయి సంవత్సరములు రాజ్యపాలన చేయమని కదా! నేను కాళిమాత వలన రెండువేల సంవత్సరములు జీవించునట్లు వరం పొందితిని. నీవు సంవత్సరమునకు ఆరు మాసములు రాజ్యపాలన చేయుము. మిగిలిన ఆరు మాసములు వినోద యాత్రలతో, తీర్ధయాత్రలతో గడుపుము. నీవు ఆవిధముగా వెళ్ళినప్పుడు రాజ్యపాలన నేను చేయుచుందును. ఇలా చేసినచో నాతొ పాటు నీవు కూడా రెండువేల సంవత్సరములు జీవించగలవు. దేవేంద్రుడిచ్చిన వరం ప్రకారం వేయి సంవత్సరములు మాత్రమే రాజ్యపాలన చేసినట్లగును అని చెప్పెను.

ఆ మాటలు విన్న రాజు చాలా సంతోషం పొంది, తమ్ముని కౌగలించుకొని "సోదరా! నీ బుద్ది బలచాతుర్యములు అమోఘం అని కొనియాడెను. నీవు చెప్పిన విధంగా మనమిద్దరం రెండువేల సంవత్సరములు కలిసిమెలిసి ఉందుము" అని పలికెను.

డబ్బును కోల్పోవడం మాములు నష్టం - మిత్రుని కోల్పోవడం పెద్ద నష్టం

No comments:

Post a Comment