Saturday 14 February 2009

శాంతశీలుడను యోగి విక్రమాదిత్యుని వద్దకు వచ్చుట

దేవేంద్రుని వరంతో, భట్టి సహాయంతో విక్రమాదిత్యుడు ఉజ్జియినిని ఎంతొ వైభవంగా పాలించుచుండెను. ఒక నాడు శాంతశీలుడను ఋషి రాజును దర్శించుటకు వచ్చెను. అతడు రాజును దర్శించి తనవెంట తెచ్చిన ఒక దానిమ్మపండును యిచ్చెను. రాజు దానిని తినకుండ, జాగ్రత్త పెట్టుడని భటులకు ఆజ్ఞాపించెను. శాంతశీలుడు ప్రతిదినం రాజును దర్శించుటకు వచ్చినప్పుడల్లా ఒక దానిమ్మపండునిచ్చి పోవుచుండెను. రాజు వాటిని తినక, భటులకిచ్చి భద్రముగా దాచు ఉండిరి.

అలా జరుగుచుండగా, ఒకనాడు శాంతశీలుడు యిచ్చిన పండుని ప్రక్కన కూర్చున్న తన కుమారుడికిచ్చెను. తలవని తలంపుగా అక్కడికి ఒక కోతివచ్చి బాలుని చేతిలోని పండుని అపహరించి, కొరికి తినబోగా ఆ పండు నుండి జలజల రత్నములు రాలేను. వాటిని చూచి రాజు ఆశ్చర్యపడి ఇంతకుముందు భద్రపరిచిన పండ్లను తెమ్మనెను. రాజు ఆ పండ్లను పగలగొట్టించి చూడగా అన్నిటిలో వెలగల రత్నములు ఉండెను. వాటిని చూచి రాజు ఆశ్చర్యానందములు పొందెను.

మరునాడు శాంతశీలుడు యధాప్రకారం రాజును దర్శించుటకు వచ్చి, ఒక దానిమ్మ పండును ఇచ్చెను. ఆపుడు విక్రమాదిత్యుడు ఆ ఋషిని చూచి, "స్వామీ! మీరు ప్రతిదినం నావద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించి వెల్లుచున్నారు. మీరిట్లు చేయుటకు ఏమైనా కారణం ఉండును. ఆ కారణమేదో తెలుపుడు. నా వలన మీకు కావాలసినపని ఏదయినా ఉన్నచో చెప్పుడు. నేను తప్పక చేసెద"నని పలికెను.

అది విని శాంతశీలుడు "మహారాజా! నేనపరపక్ష ద్వాదశినాడు అర్ధరాత్రి నాడు శ్మశానమునందు యాగం చేయదలచితిని. మీరు ఒంటరిగా వచ్చి నాయాగం పూర్తియగునట్లు సహాయపడవలె"నని కోరెను. అది విని రాజు అందుకు అంగీకరించెను.

విక్రమాదిత్యుడు ఋషికి చెప్పిన ప్రకారము అపరపక్ష ద్వాదశినాడు అర్ధరాత్రి సమయమున ఒంటరిగానొక ఖడ్గమును పట్టుకొని శ్మశానమునకు పోయి శాంతశీలుని ముందు నిలబడెను.
అప్పుడా శాంతశీలుడను ఋషి ప్రేతముఖమునందు హోమము చేయుచు రాజును చూచి ఎంతో ఆనందిచి, "ఓ సత్యసంధుడా! మంచి సమయమునకు వచ్చితివి. ఇక్కడికి దక్షిణ పార్శ్వంబున నోకపెద్ద మర్రిచెట్టు కలదు. ఆ చెట్టుపై నొక బేతాళమున్నది. దానిని నీవు పట్టితేవలెను. నీవు దానిని పట్టితెచ్చునప్పుడు దానితో నీవు మాట్లాడకూడదు" అని చెప్పెను.

రాజు "అట్లే చేసెద"నని, కొరవి చేతబట్టుకొని ఒంటరిగా ఆ చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపైనున్న భేతాళుని చూచెను. అప్పుడా భేతాలుడు తలక్రిందుగా కాళ్లు మీదుగా వ్రేలాడుచుండెను. రాజు దానిని చూచి ఏ మాత్రము భయపడగా, చెట్టుమిదికి పోయి, భేతలుని ఈడ్చి క్రిందకుత్రోసి తానూ చెట్టుదిగుసరికి ఆ భేతాళుడు నవ్వుచు నిముషములో పైకెగసి ముందువలె వృక్షమును పట్టుకొని వ్రేలాడుచుండెను.

అంతట రాజు మరల చెట్టుపైకిపోయి భేతాలునిపట్టి తన ఉత్తరీయముతొ కట్టి వీపుపైనుంచుకొని క్రిందికి దిగివచ్చెను. అప్పుడు భేతాళుడు తన శాపవిమోచన సమయము దగ్గరైనదని తలచి "ఓ మహారాజా! శీఘ్రముగా త్రోవజరుగుటకై నేనొక కథ చెప్పెదను విను"మని క్రింది విధముగా కథ చెప్పుచుండగా విక్రమాదిత్యుడు మౌనముగా నుండి వినుచు పోవుచుండెను.



జ్ఞానము ఉన్న చోట శక్తి ఉంటునది - తెలివి ఉన్న చోట వెలుగు ఉంటుంది

No comments:

Post a Comment